ఇప్పుడు చూస్తున్నది మా నాన్నని కాదు: మనోజ్ 11 d ago
మొదట్నుంచి తన స్వశక్తితోనే ఎదిగానని, ఎప్పుడు తండ్రి ఆస్తులపై ఆధారపడ లేదని సినీ నటుడు, మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ అన్నారు. జల్‌పల్లిలోని నివాసం గేటును గత రాత్రి విరగ్గొట్టి మనోజ్ లోపలికి వెళ్లారు. అనంతరం చిరిగిన చొక్కాతో బయటకొచ్చారు. ఈ క్రమంలో అక్కడికొచ్చిన మోహన్‌బాబును మీడియా వివరణ కోరగా.. ఆయన జర్నలిస్టులపై దాడి చేశారు. దీంతో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చిన మంచు మనోజ్ మీడియాతో మాట్లాడారు. ముందుగా గత రాత్రి మోహన్‌బాబు దాడిలో గాయపడిన ఇద్దరు మీడియా వ్యక్తులకు క్షమాపణ చెప్పారు. తనను తమ్ముడిగా భావించి క్షమించాలన్నారు. తన కోసం వచ్చి గాయపడడం బాధగా ఉందన్నారు.
'నా సొంత కాళ్ల మీద పనిచేస్తున్నాను.. నేను ఎలాంటి ఆస్తి అడగలేదు.. నా పేరు, నా భార్య పేరు.. కూతురి పేరు లాగుతున్నారు. నిన్న అంత చెప్పినా కూడా విజయ్ అనే వ్యక్తి మా ఇంట్లోనే ఉన్నాడు. నన్ను కొట్టేప్పుడు కూడా అతని కారులో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నా భార్య ఏడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు.. విజయవాడలోని మా అంకుల్ నాకు ఫోన్ చేసి "మనోజ్ ఎన్నో ఏళ్ల నుంచి బయట ఉన్నావు. మీ నాన్న గారు.. అమ్మగారు ఒక్కరే ఉన్నారు. మీ అన్న దుబాయ్‌కి షిఫ్ట్ అయ్యాడు. నీ వైఫ్ గర్భవతిగా ఉంది.. తనకి తల్లిదండ్రులు లేరు. ఒంటరిగా ఉన్నావు. ఒక్కడివే ఎలా చూసుకుంటావు.. తనకు మీ అమ్మ, నాన్న అవసరం ఉంది." అని చెప్పారు..దీంతో నా వైఫ్ కూడా సరే వెళ్దాం అండి అని చెప్పబట్టి.. నేను తిరిగి ఇంటికొచ్చాను.. ఈ రోజు నా మీద ఆరోపణలు చేస్తున్నారు. నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను. కేవలం ఆధారాలు మాత్రమే చూపించగలను. నేను ఎప్పటి నుంచో కూర్చుని మాట్లాడుకుందామని అనుకుంటూనే ఉన్నాను. కానీ, అక్కడ(కళాశాల) లోకల్‌గా ఉన్న పిల్లలందరూ మాకు బంధువులే. తమకు అన్యాయం జరుగుతుందని వారు నాకు అర్జీలు ఇచ్చారు. సమస్యలు పరిష్కరించాలని కోరారు.
దీనిపై వినయ్ అనే అతనికి నేను కాల్ చేశాను. మెసేజ్‌లు పెట్టాను. సార్, ఏం జరుగుతోంది.. కావాలంటే.. మీ కాళ్ల మీద పడతాను.. ఈ ఇష్యూని క్లియర్ చేయమని అడిగాను. చాలా దురుసుగా రిప్లై ఇచ్చాడు. దీనిపై ప్రతీది నేను సాయంత్రం 5 గంటలకు ఆధారాలతో సహా ప్రెస్ మీట్ పెట్టి వివరిస్తాను. ఇన్నాళ్లు ఆగాను.. ఇక ఆగలేను.. ఇక అన్నీ చెప్పేస్తాను. గొడవ జరిగిన రోజు డయల్ 100కి కాల్ చేశాను. మా ఇంట్లో ఇన్ని కార్లు ఉన్నాయి. కానీ, నేను గాయపడితే.. నన్ను తీసుకెళ్లడానికి 108 అంబులెన్స్ రావాల్సి వచ్చింది.. ఈ విషయం ఎవరికైనా.. తెలుసా... ఈ విషయం పోలీసులకు కూడా తెలుసు.. నేను ఎవరినో కొడుతున్నానని అన్నారు. కావాలంటే సీసీ టీవీ ఫుటేజీలు చూడమనండి.
కిరణ్, విజయ్ అనే వ్యక్తులు దొంగతనం చేసినట్లు నేను ఇంట్లో చెప్పాను. కానీ, ఆ కిరణ్ అనే వ్యక్తి నిన్న మా ఇంట్లోనే తిరిగాడు. బెదిరింపులకు పాల్పడుతూ..ఒక అమ్మాయి పారిపోయేలా చేశాడు. నా కూతురి బట్టలు ప్యాక్ చేశాడు. అప్పుడు నేను కంగారు.. కంగారుగా.. డీజీ ఆఫీసుకు వెళ్లాను. భయమేస్తుంది కదండి పిల్లల జోలికొస్తే.. మా నాన్న నాకు దేవుండండి.. ఈ రోజు ఏదైతే చూస్తున్నారో.. అది మా నాన్న కాదండి. నేను అబద్ధాలు ఆడే వాడిని కాదు. కావాలంటే నా స్నేహితులను అడగండి..వారందరూ సొంత కాళ్ల మీద వేర్వేరు వృత్తుల్లో స్థిరపడ్డారు. నేను కూడా నా సొంత కాళ్ల మీద నిలబడ్డాను. ఎప్పుడూ ఇది చేయండి.. అది చేయండి అని ఎవరినీ అడగలేదు. మా నాన్న భుజం మీద గన్ను పెట్టి నన్ను కాల్చాలని చూస్తున్నారు.' అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.. మంచు మనోజ్.